Breaking News

Dookudu – 2 Review (About Aagadu)


 

aagadu-mahi647x450క‌మర్షియ‌ల్ సినిమాలో కొత్త‌ద‌నం వెతుక్కోవ‌డం
డొమినోస్‌కి వెళ్లి దిబ్బ‌రొట్టి ఆర్డ‌ర్ చేయ‌డం రెండూ ఒక్క‌టే.
వండిన‌ క‌థ‌నే మ‌ళ్లీ తిర‌గేసి మ‌ర‌గేసి వండేస్తాం అని తీసిన సినిమానే తీస్తుంటే – ప్రేక్ష‌కులు విసిరి అవ‌త‌ల పాడేస్తున్నారు.
క‌నీసం ఆగ‌డు అయినా డిఫ‌రెంట్ సినిమాకి డెఫినీష‌న్‌లా ఉంటుందంటే…  ఆగ‌డుదీ అదే  ”
దూకుడు”. గ‌త నాలుగైదేళ్ల‌లో తీసిన సినిమాలు, చూసిన సినిమాలు క‌లేసి, మెలేసి, పిండేసి, ఆరేసి.. దానికి ఓ స‌రికొత్త టైటిల్ పెడితే… అదే ”ఆగ‌డు”.
బోర్ కొచ్చిన బండికి రిపేర్లు చేసి, రంగులేసిన‌ట్టు.. ఓ పాత క‌థ‌కు రంగులేసే ప్ర‌య‌త్నం చేస్తే.. అదే
 ‘‘ఆగ‌డు”.
దూకుడు తీస్తున్న‌ప్పుడు అందులో కొన్ని సీన్లు మిగిలిపోతే… వాటికి ఇంకొన్ని సీన్లు జోడించి తీస్తే.. అదే
”ఆగ‌డు”.

క్యాచ్ చేసే టాలెంట్ ఉంటే…  ఈ సినిమాలో ఓ స‌రికొత్త పాయింట్ దొరికేస్తుంది.
ఇది వ‌ర‌కు సినిమాల్లో హీరో విల‌న్ ని మాత్ర‌మే బ‌క‌రా చేస్తాడు.. కానీ ఈ సినిమాలో
హీరో విల‌న్‌నీ
విల‌న్ త‌మ్ముడ్ని
విల‌న్ చుట్టుప‌క్క‌ల‌వాళ్ల‌ని
త‌న స్టేష‌న్‌లో ఉన్న ఎస్సైని
బ్ర‌హ్మానందాన్ని,
ఆఖ‌రికి హీరోయిన్ని కూడా బ‌క‌రానీ, బ‌క‌రీని కూడా చేసేస్తాడు.
ఒక బ‌క‌రానే చూళ్లేక ఛ‌స్తుంటే.. మేక‌ల మంద‌ని వెంటేసుకొచ్చాడు.. మ‌హేష్ బాబు. ఇంత‌కీ ఈ ఆగ‌డు క‌థేంటి..?  దాని తీరేంటి?  ఇందులో మ‌హేష్ దూకుడేంటి??  
చూద్దాం. రండి.

అన‌గ‌న‌గా ఓ హీరో… చిన్న‌ప్పుడే ఇంటికి దూర‌మై…  పెరిగి పెద్డోడై – పోలీస్ అవుతాడు. ఓ ఏరియాకి సీఐగా వెళ్లి, పంచ్‌లేసుకొంటూ – విల‌న్ల పంచ‌లూడ‌గొట్టిస్తాడు..

(ఏంటి?  ఇలా చెబితే గ‌బ్బ‌ర్ సింగ్ గుర్తొస్తుందా?  దానికీ ఈ సినిమాకీ సంబంధం లేదు మొర్రో అని నిర్మాత‌లు నెత్తీ నోరు బాదుకొన్నారు క‌దా..?  ఇంకా మ‌నం గ‌బ్బ‌ర్ సింగే అనుకోవ‌డం భావ్యం కాదు కాబ‌ట్టి, స్టోరీ లైన్‌ని ఇంకో టైపులో చెప్పుకొందాం, అప్పుడైనా ఫ్రెష్ ఫీలింగ్ వ‌స్తుందేమో చూద్దాం).

అన‌గ‌న‌గా ఓ పోలీస్‌. త‌న తండ్రికి జ‌రిగిన అన్యాయానికి బ‌దులు తీర్చుకోవాల‌నుకొంటాడు. విల‌న్ గ్యాంగ్ ద‌గ్గ‌ర‌కే చేరి, అందులో నాన్న‌ని మోసం చేసిన ఒకొక్క‌డినీ ఒక్కోరకంగా మ‌టాష్ చేస్తాడు. రియాలిటీ షోల‌తో బంతాట ఆడేసుకొంటాడు. విల‌న్‌ని చంపేసి క‌థ సుఖాంతం చేస్తాడు..

(ఇప్పుడు మీకు దూకుడు సినిమా గుర్తొచ్చిందా?  వార్నీ. మీతో ఇదే తంటా. క‌థ చెప్ప‌మంటారు, చెబితే.. పోలిక‌లు తీసుకొస్తారు.. స‌ర్లెండి, ఇంకోలా ట్రై చేద్దాం)

శంక‌ర్ (మహేష్‌బాబు) ఓ అనాథ‌. చిన్న‌ప్పుడే త‌న తెలివితేట‌ల‌తో ఓ ఘ‌రానా దొంగ‌ల బ్యాచ్‌ని పోలీసుల‌కు ప‌ట్టిస్తాడు. అత‌ని తెలివితేట‌లు చూసి ముగ్థుడైన ఓ మంచి పోలీస్ (రాజేంద్ర ప్ర‌సాద్‌) శంక‌ర్‌ని చేర‌దీసి చ‌దివిస్తాడు. అయితే చేయ‌ని నేరానికి ఆ ఇంటికి దూర‌మై, జైల్లో పెరుగుతాడు శంక‌ర్‌. అక్క‌డే పోలీస్ ఆఫీస‌ర్‌గా మారి బ‌య‌ట‌కు వ‌స్తాడు. ఎన్‌కౌంట‌ర్ శంక‌ర్‌గా ఎదిగి.. బుక్క‌ప‌ట్నం బ‌దిలీ అయి వ‌స్తాడు. అక్క‌డ దామోద‌ర్ (సోనూసూద్‌) అనే దుర్మార్గుడు ఉంటాడు. ఈ దామూ వ‌ల్లే.. త‌న‌ని చిన్న‌ప్పుడు ఆద‌రించిన కుటుంబం క‌ష్టాల పాల‌వుతుంది. అందుకే  అత‌ని గ్యాంగ్‌లోనే చేరి, వాళ్ల‌లో ఒకొక్క‌డినీ త‌న చేతికి మట్టి అంటుకోకుండా మట్టుబెట్టి, చివ‌రికి విల‌న్ అంతు చూస్తాడు.  అదీ క‌థ‌…

( ఇప్పుడు మీకు మ‌రో స‌వాల‌క్ష తెలుగు సినిమాలు వ‌రుస‌కట్టేసుంటాయ్‌. ఏం చేస్తాం?  తెలుగు సినిమా అలా త‌గల‌డింది. ఏ సినిమా చూసినా పాత క‌థ‌లే త‌గుల్తున్నాయి. అందుకే క‌థ జోలికి వెళ్ల‌కుండా పాయింట్‌కొచ్చేద్దాం)

తెలుగు సినిమా క‌థ‌ల‌తో కాకుండా, క‌మ‌ర్షియ‌ల్ కొల‌త‌ల‌తో త‌యార‌వుతోంది. అలాంటి మ‌రో సినిమా దూకుడు. మ‌హేష్ బ‌లాబ‌లాలూ, ఇది వ‌ర‌కు అత‌ను చేసిన సినిమాలు, శ్రీ‌నువైట్ల స్టైల్‌, పాత హిట్ సినిమాలు… ఇవ‌న్నీ మిక్స్ చేసి అల్లేసిన సినిమా ఇది. తెలుగు ప్రేక్ష‌కుడు మ‌హా అల్ప సంతోషి. పెద్ద‌గా ఆశ‌లు పెట్టుకోకుండానే థియేట‌ర్ల‌కువ‌స్తాడు. అద్భుతాలు ఇవ్వ‌క్క‌ర్లెద్దు.. కాస్త టైమ్ పాస్ చేయిస్తే చాలు.. ఆ సినిమాకి ఫ‌స్టు క్లాసు మార్కుల‌తో పాస్ చేయిస్తాడు. ఈ సినిమా కూడా ప్రేక్ష‌కుడికి వినోదం పండ‌చ‌మే ధ్యేయంగా తీశారు.. అయితే అలా న‌వ్వించ‌డానికి పాత క‌థ‌, పాత స‌న్నివేశాలు, పాత ఫార్ములా వెంట ప‌రుగులు తీశారు. అదే.. మ‌నం చేసుకొన్న దుర‌దృష్టం.

దూకుడు సినిమాకి మ‌రో యాంగిల్ ఏమైనా ఉంటే.. అది ఆగ‌డు. తండ్రిని అన్యాయం చేసిన‌వాడి అంతు చూడ‌డం రెండు క‌థ‌ల ల‌క్ష్యం. అందులో రియాలిటీ షోలు చేసి, కొంత‌మంది బ‌క‌రాల‌ను త‌యారు చేసి, విల‌న్ గ్యాంగ్‌పై వ‌దులుతాడు. ఇందులోనూ అంతే. కాక‌పోతే దూకుడులో ఒక్క‌డే బ‌కరా. ఇందులో అడుగ‌డుగుకు ఓ బ‌క‌రా. క‌లుగులో పొగ పెట్టి, ఎలుక‌ను బ‌య‌ట‌కు తీసుకురావ‌డం హీరో ఫార్ములా. ప్ర‌తి ఒక్క‌రికీ ఓ క‌థ చెప్పి, వాడ్ని బ‌క‌రా చేసుకొని ఆడుకొంటాడ‌న్న‌మాట‌. వాడి ద్వారా విల‌న్‌ని బ‌య‌ట‌కు ర‌ప్పిస్తాడు. ఈ ఫార్ములా ఒక‌ట్రెండుసార్లు ఒకే. ప్ర‌తీ ఎపిసోడ్‌కీ ఓ క‌త్త క‌థ‌, ఓ కొత్త బ‌క‌రా అంటే ఎలా..??  దూకుడులో త‌న‌కు ఏమైతే ప్ల‌స్ అయ్యాయోవాటిని మ‌రోసారి వాడేసుకోవాల‌ని చూశాడు శ్రీ‌నువైట్ల‌. ఈ అతికి అంతూ పొంతూ ఉండొద్దా??  మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు రియాలిటీ షో, టీవీ ప్ర‌క‌ట‌న‌లు వీటినే కాదు, తెలుగు సినిమా డైలాగుల‌ను కూడా పేర‌డీ చేసి అందులోంచి కామెడీ పుట్టిద్దామ‌నుకొన్నారు. అది కొంత వ‌ర‌కూ న‌వ్వు పుట్టించింది. మిగిలిన సందర్భాల్లో వెగ‌టు తెప్పించింది. పోసానితో అల్లిన రియాలిటీ షో… లెంగ్త్ ఎక్కువ‌వ్వ‌డంతో బోర్ కొట్టింది. స‌రోజా స్వీట్స్‌పై అల్ల‌న యాడ్స్ ప‌రిస్థితీ అంతే. బ్ర‌హ్మానందాన్ని ఎన్ని సినిమాల్లో బ‌క‌రాని చేస్తారు??  అప్ డేట్ అవ్వండ్రా అని చెప్ప‌డం కాదు. ముందు అప్ డేట్ అవ్వాల్సింది త‌నేన‌ని శ్రీ‌నువైట్ల గుర్తు పెట్టుకోవాలి.

అంత వ‌ర‌కూ భ‌యంక‌రంగా చూపించిన విల‌న్ స‌డ‌న్‌గా హీరో మాట‌ల‌కు ఎలా ప‌డిపోతాడో, ఎలా త‌ను చెప్పిన‌ట్ట‌ల్లా ఆడ‌తాడో అర్థం కాదు. హీరోయిజం అంటే ఇంతేనా అనిపిస్తుంది. ఈ ఫార్ములా ఎప్పుడు వ‌దులుతారో, అప్ప‌టి వ‌ర‌కూ తెలుగు సినిమా బాగుప‌డ‌దు.

మ‌హేష్ ఎలా చేశాడు??  ఈ టాపిక్‌పై మాట్లాడితే ఆడియో రిలీజ్‌లో ప్రొడ్యూస‌ర్లు హీరోని పొగిడిన‌ట్టే ఉంటుంది. మ‌హేష్ ఈ సినిమాలో మ‌రింత అందంగా క‌నిపించాడు. నిజానికి పోలీస్ పాత్ర‌లొస్తే.. కాస్త ఫిట్‌గా ఉండ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. మ‌హేష్ మాత్రం మ‌రింత స్లిమ్ అయ్యాడు. అత‌ని డైలాగ్ డెలివ‌రీ కొత్త‌గా ఉంది. స్పీడు స్పీడుగా మాట్లాడేశాడు. మైన‌స్ ఏంటంటే.. ఆ స్పీడుకి కొన్ని డైలాగులు ఎగిరిపోయాయ్‌. కొత్త స్టెప్పులు వేసి అభిమానుల్ని అల‌రించే ప్ర‌య‌త్నం చేశాడు. ఎమోష‌న‌ల్ ఏంగిల్ ట‌చ్ చేయ‌డానికి శ్రీ‌నువైట్ల పెద్ద‌గా ట్రై చేయ‌లేదు. సినిమా అంతా నేను చూసుకొంటా, కుమ్మేస్తా.. అని మాటిచ్చి రంగంలో దిగిన‌ట్టు ఫ‌స్ట్ సీన్ నుంచీ మ‌హేష్‌ది ఒకటే దూకుడు.  త‌మ‌న్నా చేసిందేం లేదు. చుంచు మొహం వేసుకొని (ఈ సినిమాలో హీరో, హీరోయిన్‌ని ఇలానే వ‌ర్ణిస్తాడు) చూడ‌డం త‌ప్ప‌. పాట‌కు ముందోసారి వ‌స్తుంది. శ్రుతి హాస‌న్ రెమ్యున‌రేష‌న్ ఎక్కువ తీసుకొన్న విశ్వాసంతో చెల‌రేగిపోయింది. ఆ క‌న్సేష‌న్ కాస్ట్యూమ్స్‌కి ఇచ్చింది. స‌గం బ‌ట్ట క‌ట్టుకొంటే ఒట్టు. సోనూసూద్‌కి ఇది మ‌రో రొటీన్ పాత్ర‌. అందులో ప‌దును లేదు. బ్ర‌హ్మానందం కాస్త న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు. చివ‌ర్లో అత‌నిపై అల్ల‌న మెట్లీ ఎపిసోడ్ శుద్ధ దండ‌గ‌. పోసాని, ఆశీష్ విద్యార్థి త‌దిత‌ర బ్యాచ్ ఓకే. రాజేంద్ర‌ప్ర‌సాద్ పాత్ర‌కీ అంత స్కోప్ లేదు.

త‌మ‌న్ ఇక మార‌డుగాక మార‌డు. ఏంటా?  బాదుదు. సినిమాకి పేరు ఆగ‌డు అని చెప్పారో, బాదుడు అని చెప్పారో తెలీదుగానీ, బాదిపారేశాడు.  క‌నీసం ఒక్క పాట‌లో అయినా  సాహిత్యం విన‌ప‌డితే… అత‌ని ఫొటో జేబులో పెట్టుకొని తిర‌గొచ్చు. ఆర్‌.ఆర్ అయితే అరాచ‌కం. పొటో గ్ర‌ఫీకి పేరు పెట్ట‌లేం. కోట్టు ఖ‌ర్చు పెట్టిన త‌ర‌వాత ఆ స్థాయిలో చూపించ‌క‌పోతే ఎలా??  ఈ సినిమాని నిల‌బెట్టేది ఏమైనా ఉందంటే, డైలాగులో. పంచ్‌లు వ‌రుస‌క‌ట్టాయి. అందులో ప్రాస కోసం రాసేసిన‌వి ఎక్కువే అయినా… చ‌ల్తా. ముఖ్యంగా సెటైర్లు బాగా పేలాయి. ప్ర‌తివోడూ పంచ్‌లు వేసేశాడు. రొటీన్ క‌థ ఎంచుకొన్న శ్రీ‌నువైట్ల‌, త‌న టేకింగ్‌, స్ర్కీన్ ప్లే టెక్నిక్స్‌తో ఈ సినిమాకి కాప‌డ‌లేక‌పోయాడు. మ‌హేష్, త‌ను ప‌లికే సంభాష‌ణ‌లు, కొన్ని కామెడీ ట్రాక్‌లూ త‌ప్పిస్తే.. ఆగ‌డుని భ‌రించ‌లేం. మొత్తానికి మ‌హేష్ ఈ సినిమాని ఓన్లీ వ‌న్ ఎస్సెట్‌. మ‌హేష్ అభిమానులు, అత‌న్ని బాగా ఇష్ట‌ప‌డేవాళ్లూ ఎన్‌కౌంట‌ర్ శంక‌ర్ వేసే కౌంటర్లు చూసి ఎంజాయ్ చేయొచ్చంతే.

తెలుగు సినిమా మూస‌లోంచి బ‌య‌ట‌కు రావాల్సిన త‌రుణ‌మిది. ఇన్ని కోట్లు, క్రేజీ కాంబినేష‌న్లు, అంతులేని ప‌బ్లిసిటీ ఓ సినిమాని గ‌ట్టెక్కించ‌లేవు. హీరో ఇమేజ్ ఒక్క‌టే బండి లాగ‌లేదు. కానీ ఈ సినిమా న‌మ్ముకొంది దాన్ని మాత్ర‌మే. అందుకే రిజ‌ల్ట్ మాత్రం అంతంత మాత్ర‌మే.
ఈ సినిమాకి రేప‌టి నుంచి ఇంట‌ర్వ్యూలు, స‌క్సెట్ మీట్లు, ప్లాటిన‌మ్ డిస్క్‌లు అంటూ హ‌డావుడి చేస్తే కంగారు ప‌డొద్దు. ఫ్లాప్ సినిమాల‌కే ప‌బ్లిసిటీ ఎక్కువ‌ని క్లారిటీ తెచ్చుకోండి.

happy wheels 2